
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోంది
హైదరాబాద్ : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా పని తీరును అభినందించింది హైకోర్టు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమని పేర్కొంది. మరీ ముఖ్యంగా బతుకమ్మకుంట అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందని పేర్కొంది. ఆక్రమణలకు గురై చెత్తకుప్పలా, పిచ్చిమొక్కలతో అటువైపు చూడాలంటే భయంగా ఉన్న ప్రాంతాన్ని చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హర్షణీయమని తెలిపింది. బతుకమ్మకుంట సర్వాంగ సుందరంగా మారి.. ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. ఆ పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పించడమే కాకుండా భూగర్భ జలాలను కూడా పెంచింది. గచ్చిబౌలిలోని మల్కం చెరువును చూసినా ఆహ్లాదంగా కనిపిస్తోంది.
నగరంలో ఇలాగే మరో 5 చెరువుల అభివృద్ధి జరుగుతోంది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎవరివైనా ఇంటి స్థలాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద వారికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి.ప్రభుత్వం ఇందుకోసం సరైన విధానాన్ని తీసుకు రావాలని స్పష్టం చేశారు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి. మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు పరిధిలోని రెండు ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ కేసు విచారణ సందర్బంగా ఈ కీలక కామెంట్స్ చేశారు. టీడీఆర్ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే చెరువుల అభివృద్ధికి ఆటంకం ఏర్పడదన్నారు.టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీధర్ కూడా జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించారు. కాగా తమ్మిడికుంటలో భూములు కోల్పోయిన వారికి సరైన టీడీఆర్ అందించాలంటూ జడ్జిని కోరారు.