ఆలయ అభివృద్ది గురించి ప్రత్యేక చర్చ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ (టీటీడీ) బీఆర్ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు, హిమాయత్ నగర్ టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ నేమూరి శంకర్ గౌడ్. టీటీడీ ఆలయ అభివృద్ధికి సహకరించాలని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాని ఈ సందర్బంగా కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే కీలక చర్యలపై చర్చించారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల మెరుగుదల, రాబోయే ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు శంకర్ గౌడ్.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన అనంతరం శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తాను ప్రస్తావించిన అన్ని అంశాల గురించి తను సావధానంగా విన్నారని తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే నిధుల మంజూరీకి కూడా హామీ ఇచ్చారన్నారు. అంతే కాకుండా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన 100 గదుల నిర్మాణానికి సంబంధించిన అంశం గురించి ప్రత్యేకంగా తాను చైర్మన్ తో ప్రస్తావించానని చెప్పారు శంకర్ గౌడ్. దీనిపై కూడా టీటీడీ చైర్మన్ చాలా సానుకూలంగా స్పందించారని, ఈ సందర్బంగా ఆయనకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.







