ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం
విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని ప్రకటించారు. నర్సింపట్నం పర్యటన సందర్బంగా ఆయనను ఉక్కు పరిశ్రమకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కలిశారు. తమ న్యాయ పరమైన పోరాటానికి, ఆందోళనకు మద్దతు ఇవ్వాలని జగన్ రెడ్డి ని కోరారు. ఈ సందర్బంగా ఆయనకు వినతి పత్రం సమర్పించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ సర్కార్ తమను మోసం చేసిందని వాపోయారు. రోజు రోజుకు బతికే పరిస్థితులు లేకుండా పోయాయని, స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి బతుకుతున్నామని కానీ ఉన్నట్టుండి ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
కార్మికులు ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడం ద్వారా ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేకమైన క్యాప్టివ్ మైన్లను కేటాయించాలని అన్నారు. అంతేకాకుండా ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. తొలగించబడిన ఉద్యోగులను తిరిగి నియమించాలని కూడా వారు పిలుపునిచ్చారు. ఈ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు.






