సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా కల్పిస్తామని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. గురువారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఉన్న పళంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం పట్ల ఫైర్ అయ్యారు. అంతే కాదు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి కార్గో ద్వారా రూ. 30 కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ. 3 కోట్లకు ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. మొత్తంగా ఆర్టీసీని అమ్మేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దీనిని అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర సర్కార్ కు.
ఆర్టీసీని ప్రైవేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో కమీషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెర లేపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ఎలక్ట్రిక్ బస్సులే కదా ఆర్టీసీ బస్సులు ఉండవని ఉప్పల్, మియాపూర్లో ఉన్న ఆర్టీసీ వర్క్ షాపులను అమ్మేస్తున్నాడని వాపోయారు. జూబ్లీ బస్ స్టాండుతో సహా రాష్ట్రంలో ఉన్న అనేక బస్ స్టాండులు కుదవ పెట్టి రేవంత్ రెడ్డి 1500 కోట్లు అప్పు తేచాడన్నారు . ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్‌కు రూ.59 కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని ప్రజలు దీనిని గమనించాలని కోరారు.






