ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన తర్వాత హైకోర్టు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీసీలు తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు
బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించి ఉంటే ఈరోజు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇదే విషయం నిన్న ఈరోజు హైకోర్టులో జరిగిన వాదన సందర్భంగా అసెంబ్లీలో చేసిన చట్టానికి గవర్నర్ ఆమోదం ఉందా అని రాష్ట్ర హైకోర్టు పదేపదే ప్రశ్నించింది అని అన్నారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం కనుక ఉంటే ఈరోజు రాష్ట్ర హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని తాము డిమాండ్ చేశామన్నారు. కానీ బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పదేపదే బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించారాని ఆరోపించారు శ్రీనివాసులు గౌడ్ . బిజెపి నేతలు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఉంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వారనీ, బిజెపి ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అనడం సిగ్గుచేటు అన్నారు .






