పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయవాడ : పుస్తక పఠనం అనేది మన జీవితంలో భాగం కావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’. తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పుస్తక పఠనం మానసిక బలాన్ని పెంచుతుందని అన్నారు. విశాలమైన, విస్తృతమైన ఆలోచనలను పెంపొందించేలా చేస్తుందన్నారు. మానసిక పరిపక్వత మనలో పెరగడానికి , సామాజిక అంశాలపై మనదైన అవగాహన పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
తాను తరచూ విభిన్నమైన పుస్తకాలను చదువుతానని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇప్పుడు కారులో వస్తూ వనవాసి అనే పుస్తకం మరోసారి చదివానని అన్నారు. 1914, 1920ల కాలంలో కోల్ కతలోని పరిస్థితి సామాజిక అంశాలను వనవాసిలో చక్కగా చర్చించారని తెలిపారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో రకమైన అంశం, జీవితం దాగి ఉంటాయన్నారు. మన మెదడు చురుకుగా పని చేయడానికి, కొత్తగా ఆలోచించడానికి కూడా పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పారు. లక్ష్మీ పురి రాసిన పుస్తకంలో స్త్రీని అత్యంత శక్తిమంతమైన మనిషిగా చూపడం ఆమె ఉన్నతికి నిదర్శనం అన్నారు.
నన్ను చాలా మంది లెఫ్ట్ భావాలు వదిలేసిన వ్యక్తిగా ప్రస్తావిస్తారు. నేనెప్పుడూ లెఫ్టిస్టు కాదు రైటిస్టూ కాదు అని అన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని అన్నారు. ఒకేలాగా ఆలోచిస్తానని చెప్పారు. వామపక్షవాదులు రాసిన పుస్తకాలు చదవడంతో పాటు, వారితో పరిచయాలు ఉన్నాయన్నారు. అలాగే జాతీయవాద భావాలు ఉన్న పుస్తకాలు కూడా నేను చదువుతానని అన్నారు. భారతీయ సంస్కృతి ధర్మం గురించి తెలుసుకుంటాను. దేశ భక్తి విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. ప్రతి పుస్తకం విలువైనదే. దేశభక్తి మనకు పుట్టుకతోనే రావాలని కోరుకుంటానని చెప్పారు పవన్ కళ్యాణ్.






