వెల్లడించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారని తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు మంత్రులతో కలిసి. సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి మంత్రుల బృందం చర్చించింది. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈ, రైతు కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు.
సూపర్ జిఎస్ టి సూపర్ సేవింగ్స్ పై విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. నూతన జిఎస్ టి విధానంవల్ల కలిగే లబ్ధిపై రాష్ట్ర వ్యాప్తంగా హాస్పటల్స్ లో 22,500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నూతన జిఎస్ టి అమలులోకి వచ్చాక రాష్ట్రంలో ఆటో మొబైల్ సేల్స్ గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఈ పెరుగుదల 33 శాతానికి పైగా ఉందని అన్నారు. లగ్జరీ కార్లకు సైతం సెస్సును తొలగించడం వల్ల ఆ విభాగంలో కూడా అమ్మకాలు ఆశాజనకంగా నమోదవుతున్నాయని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 16నుంచి 19 తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో గ్రాండ్ జిఎస్టి షాపింగ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చెయ్యాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది.






