ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది
గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రైతులకు అధిక దిగుబడి విత్తనాలు, ఆధునిక సాంకేతిక సాయం, మార్కెట్ అనుసంధానం లభించనుందని అన్నారు. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభించారని తెలిపారు. పంట నష్టాలకు భరోసా మార్కెట్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను ఆనందంగా ఉంచడానికి అన్ని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి ముందుకు వెళుతున్నాం చెప్పారు. రైతులు ఇబ్బంది పడకూడదని బర్లీ పొగాకును రూ.270 కోట్ల తో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగిందని, మామిడి ,కోకో , ఉల్లి ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేసిందన్నారు. రైతుల నుంచి సీసీఐ ద్వారా సక్రమంగా పత్తి కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు అచ్చెన్నాయుడు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల పెంపు, నాణ్యతపై దృష్టి, పంట అనంతరం నష్టాలు తగ్గించడం ప్రధాన లక్ష్యంగా వివిధ పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి-ఉత్పాదక పెంచటంపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించటం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆహార అలవాట్లు మారిన నేపథ్యంలో ప్రోటీన్ తో కూడిన పప్పు ధాన్యాలను ప్రజలకు అంద చేయటానికి పప్పు ధాన్యాల మిషన్ ద్వారా పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. రైతులు ఒకే విధమైన పంటలను సాగు చేయకుండా ప్రకృతి సాగు పద్ధతులను అవలంబించాలన్నారు. విదేశాలకు ఎగుమతులకు వీలుగా పంట ఉత్పత్తుల్లో నాణ్యతను పెంపొందించే సాగు విధానాలను పాటించాలని సూచించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అవసరమైన పూర్తి సహాయ సహకారాలను నిరంతరం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలని, ధాన్య పంటలతో పాటు పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దేశాన్ని ఆహార భద్రతలో స్వావలంబన దిశగా తీసుకెళ్లడం ప్రధాని గారి లక్ష్యం అని మంత్రి అన్నారు.






