స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి
ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై సీరియస్ గా స్పందించారు. పాకిస్తాన్ ప్రజలు, మెజారిటీ, శాంతిని ఇష్టపడే వారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు. పాకిస్తాన్ పౌరులతో తమకు ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ఉద్రిక్తతలు సృష్టించే కొన్ని అంశాలు ఉన్నాయని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులను, దాని జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటుందని ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు ముత్తాకి. కానీ కావాలని పాకిస్తాన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇది మంచిది కాదన్నారు.
తాము నిన్న రాత్రి తమ సైనిక లక్ష్యాలను సాధించడం జరిగిందని చెప్పారు. ఖతార్, సౌదీ అరేబియా దేశాలు వివాదాన్ని ముగించాలని కోరాయన్నారు ముత్తకి. దీంతో వారి విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా దాడులను నిలిపి వేయడం జరిగిందని అన్నారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందన్నారు. తాము అన్ని దేశాలతో శాశ్వతమైన, శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖా మంత్రి. ఎవరైనా సరే అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశం తమకు మద్దతు ఇస్తూ వస్తోందన్నారు.






