అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు
హైదరాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది బీసీ జేఏసీ. హైదరాబాద్ లో 136 సంఘాలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు చట్టంగా రూపొందించేంత దాకా తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు బీసీ జేఏసీ నేతలు. 60 శాతం ఉన్న బీసీల ఓట్లు కావాలంటే 18న తాము తలపెట్టిన బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ జేఏసీ చైర్మన్ గా ప్రముఖ బీసీ సంఘం నాయకుడు , ఎంపీ ఆర్. కృష్ణయ్య ను ఎన్నుకోగా, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకున్నారు. తమకు దోస్తులు ఎవరో , ద్రోహులు ఎవరో బంద్ తో తేలుతుందన్నారు.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్భంధం చేస్తామని ప్రకటించారు. 14న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను వాయిదా వేశామన్నారు. 18న నిర్వహించ బోయే బంద్ తో బీసీల బలం ఏమిటో చూపిస్తామన్నారు బీసీ నేతలు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి బీసీలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని అన్నారు. అలా పోరాడితేనే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతాయని ఆయన అన్నారు. ఇప్పుడు జరిగే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభలు బీసీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు ఛాన్స్ ఏర్పడుతుందన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలను ఐక్యంగా లేరని బీసీలకు రావలసిన నోటికాడ ముద్దను పిడికెడు శాతం లేని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.






