నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖ నగరంలో
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరం వేదికగా వచ్చే నెల నవంబర్ లో 14, 15 తేదీలలో 4వ సారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈసందర్బంగా విశాఖ సదస్సును సక్సెస్ చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఏపీని ఐటీ , ఏఐ, ఎంఐ హబ్ గా మార్చుతున్నామని చెప్పారు. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువగా ఉందని, వేగంగా పనులు చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు.
ఈ సీఐఐ సదస్సులను గతంలో 2016, 2017, 2018లో మూడు సార్లు విశాఖలోనే నిర్వహించడం జరిగిందని చెప్పారు సీఎం. ఇప్పుడు విశాఖనే సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. ఈసారి సీఐఐ సదస్సు ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్’ థీమ్‌తో మొత్తం 13 సెషన్లుగా జరగనుందన్నారు నారా చంద్రబాబు నాయుడు.. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
ట్రేడ్, జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.






