సంచలన ఆరోపణలు చేసిన ధర్మాన ప్రసాద రావు
శ్రీకాకుళం జిల్లా : ఏపీ సర్కార్ పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్దిని దేశం మొత్తం చూసిందన్నారు ఆనాడు. ఆయన స్పందించిన తీరుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్న తరుణంలో ఉచితంగా వైద్యం అందించిన ఘనత తమ సర్కార్ దేనని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులతో సమర్థవంతంగా పని చేయించు కోవడంలోనూ సక్సెస్ అయ్యామన్నారు.
కరోనా సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న ఎన్నో కుటుంబాలు ఒక పక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతో పాటు ఇంకో పక్క ఆర్థికంగా చితికి పోయి ఇప్పటికీ ఆ కష్టాల నుంచి తేరుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు. కరోనా లాంటి దుస్థితిని చూశాక కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ప్రతిఒక్కర్నీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వ సంపదన ప్రైవేటుకు దోచి పెట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు ధర్మాన.
నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. నాణ్యమైన వైద్యం కోరుకోవడం రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు అని, వాటిని కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కూలీనాలీ చేసుకుని పేదలు కూడ బెట్టుకుంటున్న సొమ్మంతా అనారోగ్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటుంటే చోద్యం చూడటం చాలా తప్పు అన్నారు. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల చేతుల్లో పెట్టడమంటే ఇది ఇంకా పెద్ద నేరం కాక మరేమిటి అని ప్రశ్నించారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారని చెప్పారు.






