స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా నిర్వహిస్తూ వస్తున్న ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. ఆక్రమణల గురించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వహించిన ప్రజా వాణిలో 48 ఫిర్యాదులు అందాయి. ప్లాట్ పక్కన పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే కబ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వరూపాలను మార్చేస్తున్నారు. చెరువులను కలుపుతూ సాగే వరద కాలువలను కూడా ఇష్టానుసారం మలుపులు తిప్పుతున్నారు. దీంతో కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయని పలువురు నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రహదారులను ఆక్రమించేసి వ్యాపారాలు చేస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు వాపోయారు. శ్మశానవాటికలతో పాటు చెరువులను చెరబడుతున్నారని పలురువు హైడ్రాను ఆశ్రయించారు. రావిర్యాల పెద్ద చెరువు ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ నీరు వచ్చి చేరడంతో పైన ఉన్న హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే ఔట్లు కూడా మునిగి పోతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం కౌశల్యా కాలనీలో పార్కుతో పాటు రహదారులను కబ్జా చేసి దుకాణాలు ఏర్పాటు చేశారని దీంతో రాజీవ్ గాంధీనగర్ నుంచి మియాపూర్ ప్రధాన రహదారికి చేరడం కష్టంగా ఉందని పలువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేట విలేజీలోని రామచంద్రయ్య కాలనీ మురుగు, వరద నీటిలో గత 8 నెలలుగా మునిగి ఉందని వాపోయారు. చెన్నం చెరువు నుంచి రేళ్ల చెరువుకు వెళ్లే వరద కాలువను మూసేయడంతో వరద తమ కాలనీని ముంచెత్తి దాదాపు 40 ఇళ్లు వరదనీటిలోనే ఉంటున్నాయని చెప్పారు. ఇళ్లు ఖాళీ చేసి వేరే చోట అద్దెకు ఉంటున్నామని వాపోయారు. గతంలో ఉన్న వరద కాలువను పునరుద్ధరిస్తే ఈ వరద ముప్పునుంచి బయట పడతామని హైడ్రా కమిషనర్‌కు ఫొటోలతో సహా చూపించారు. గతంలో హైడ్రా చర్యలవల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.






