బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని వార్నింగ్
హైదరాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలంటే రాష్ట్రంలో భయపడే స్థితికి తీసుకు వస్తామన్నారు. తమకు పదవుల కంటే రిజర్వేషన్లు ముఖ్యమన్నారు. బీసీలను కోర్టులు నిట్ట నిలువునా ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు . ఆరు నూరైనా ఎవరు అడ్డుకున్నా బీసీ బంద్ జరిగి తీరుతుందన్నారు. ఈ బంద్ లో అన్ని కులాల వారంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులు తిప్పితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజలు ఆవేశంగా ఉన్నారని, బస్సులు తిరిగితే తగులపెట్టే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇదిలా ఉండగా తాము ఈనెల 18న తలపెట్టిన బంద్ కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. న్యాయం చెప్పాల్సిన సుప్రీంకోర్టులో అన్యాయం జరిగిందన్నారు.న్యాయ వ్యవస్థలో దారులు మూసుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్. ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తే తప్ప బీసీ రిజర్వషన్ల అమలు సాధ్యం కాదని సంచలన ఆరోపణలు చేశారు.






