రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్
వరంగల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయమని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా శనివారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిపి బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నామన్నారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ చాలెంజ్ గా తీసుకొని బీసీ బిల్లును తీసుకొచ్చారని చెప్పారు కొండా సురేఖ.ఆర్డినెన్స్ తీసుకొచ్చినం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్నం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్ధతు తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలుపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆట ఆడుతున్నదని ఆరోపించారు.
రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదన్నారు .ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బీసీ బిల్లు రిజర్వేషన్ చెల్లుబాటు కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి బీసీ సంఘాలు. బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ బంద్ కు పిలుపునిచ్చారు.






