నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా నిర్వహించిన మానవహారంలో కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అందుకే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. అయినా కావాలని రిజర్వేషన్ల విషయంలో మోసం చేశారని ఆరోపించారు కవిత. దీనిని సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడం దారుణమన్నారు.
తెలిసీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని, చివరకు చెంప ఛెళ్లుమనిపించేలా కొట్టి వేసిందని, తిరిగి హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిందన్నారు. జీవోను కొట్టి వేసినా సిగ్గు లేకుండా బీసీ రిజర్వేషన్లను కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపునకు మద్దతు ఇవ్వడం విస్తు పోయేలా చేసిందన్నారు కల్వకుంట్ల కవిత. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముందని ప్రశ్నించారు. మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగ లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.






