స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు. గూగుల్ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందన్నారు. సానుకూల విధానాలతోనే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అప్పుడే సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల నైపుణ్యం నిరంతర ప్రక్రియగా ముందుకు సాగాలని అన్నారు.
మానవ వనరులే మనకు ఉన్న అతిపెద్ద మూలధనం అని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటన్నిటిపైనా భాగస్వామ్య సదస్సులో చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు. విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు హాజరయ్యే వారికి హోం స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులను, నిపుణులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఉన్న విశ్వ విద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలని అన్నారు. దేశ ప్రయోజనాలు ఆశించి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఈ భాగస్వామ్య సదస్సును ఏపీ నిర్వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
సదస్సులో చర్చించాల్సిన వివిధ అంశాలపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లాంటి కార్యక్రమాలు కూడా అనుసంధానించాలని ముఖ్యమంత్రి అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఏఐ తరహాలో ఏపీ టూ ఏఐ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. భాగస్వామ్య సదస్సులో ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలను వివరించేలా ప్రజంటేషన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.






