కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే ముందంజలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత. ఆమెకు అండగా రంగంలోకి దిగారు మాజీ మంత్రులు, బావ బామ్మర్థులు కేటీఆర్, హరీశ్ రావు. మరో వైపు లేట్ గా ప్రకటించింది బీజేపీ తమ అభ్యర్థిని. తమ పార్టీ తరపున వ్యాపారవేత్త లంకాల దిలీప్ రెడ్డిని ఖరారు చేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ ను బరిలోకి దిగింది. ఇక్కడ ముస్లిం, పేదల ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
మరో వైపు బుధవారం ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు మంత్రి సీతక్క. తను వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఓటర్లలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఎవరూ ఊహించని విధంగా టిఫిన్లు వడ్డిస్తూ, బట్టలు ఐరన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు మంత్రి . ఈ సందర్బంగా ఆమె ఓటర్లతో సంభాషించారు. తాము అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తమ అభ్యర్థి గెలవడం పక్కా అని అన్నారు.






