స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం బొక్సoపల్లి గ్రామం సమీపంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులో రూ.7 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. దేశ విదేశాలకు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి ఫలితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయన్నారు ఎస్. సవిత. ఇందుకు ఉదాహరణ విశాఖలో రూ.లక్షా 33 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందమేనన్నారు. కేవలం పెద్ద పరిశ్రమల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సైతం ప్రోత్సాహిస్తున్నారన్నారు. యువత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సకాలంలో అనుమతులిస్తోందని వెల్లడించారు. అన్ని నియోజక వర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తోందన్నారు.






