సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం గన్ కల్చర్ కొనసాగుతోందని, రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పి తీరాలన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లోని రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వ లేదని , ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. ఇతర రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని విమర్శించే పదే పదే విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీకి ఇక్కడ జరుగుతున్నది ఏమిటో కనిపించడం లేదా అని నిలదీశారు. హైడ్రా పేరుతో పేదలు, సామాన్యులను బెంబేలెత్తిస్తున్నారని, పెద్దోళ్ల, బడా బాబుల వద్దకు వెళ్లడం లేదని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లును చట్టంగా మారిన వెంటనే అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అనే విషయం రాహుల్ గాంధీకి తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రాల కన్నా ముందే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన వక్ఫ్ చట్టాన్ని అమలు చేసిందన్నారు.






