మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి వ్యవసాయ రంగ పితామహుడిగా పేరు పొందిన స్వామి నాథన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ రంగంలో విశేషంగా కృషి చేసిన పలువురికి సన్మానం చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. రైతు కష్టం వారి కోసం కాదు, లోకం కోసం అన్నారు. అయితే వారికి సంఘటిత శక్తి, లాబీయింగ్ వంటివి లేనే లేవన్నారు. అందుకే పట్టణాలకు, పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత గ్రామాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అందించాలని పిలుపునిచ్చారు. రైతులను చైతన్యవంతం చేసే బాధ్యతను ప్రభుత్వాలు స్వీకరించాలని కోరారు. ఇందు కోసం విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఆహారం అయితే లభిస్తోంది కానీ పోషకాహార లోపం (Hidden Hunger) లేకుండా చూడాలన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ స్ఫూర్తిని మార్గదర్శకంగా తీసుకోవాలని కోరారు వెంకయ్య నాయుడు. పర్యావరణానికి దన్నుగా నిలిస్తూ దండిగా పోషకాలు అందించే రాగి, సజ్జ, జొన్న, ఆరిక, కొఱ్ఱ వంటి సిరిధాన్యాల ఉత్పత్తి దిశగా ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ విషయంలో ప్రత్యేకించి యువతరాన్ని చైతన్యవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వాలు, ప్రచార సాధనాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు వెంకయ్య నాయుడు. రైతులు పూర్తిగా వ్యవసాయం మీదనే కాకుండా, అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. అనుబంధ రంగం అంటే వ్యవసాయానికి నిజమైన సాయం. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల వారు తమ తమ కోణాల్లో రైతు సమస్యలను గుర్తించడం అన్నారు.






