జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన
హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. సోమవారం ఆయన బీసీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని గల్లి నుండి ఢిల్లీ వరకు ఉధృతం చేయడానికి వచ్చే నెల నవంబర్ రెండవ తేదీన హైదరాబాద్ లోని కళింగ భవన్ లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ ,మండల కేంద్రాలలో నిరసన దీక్షలు చేపడతామని, మూడో వారంలో పల్లె నుండి పట్నం వరకు బారి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు, బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కోరుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ రాజకీయ పార్టీలకతంగా బీసీ జేఏసీని విస్తృత పరుస్తామన్నారు. కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతామని చెప్పారు. గతంలో నిర్వహించిన మండల కమిషన్, మురళీధర్ రావు కమిషన్ ఉద్యమాల లాగానే, తెలంగాణ ఉద్యమ తరహలోనే బీసీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి రాజ్యాంగ సవరణ ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ జరగడానికి కేంద్రంలోని బిజెపి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, రెండు పార్టీల మీద ఒత్తిడి తీసుకవచ్చి శాశ్వతంగా ఎస్సీ ఎస్టీలకు ఉన్న విధంగానే బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి పోరాడుతామని వార్నింగ్ ఇచ్చారు.






