సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్
అమరావతి : ఏపీలో మళ్లీ మొదటికి వచ్చింది కథ. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పునర్ విభజన కార్యక్రమంపై సుదీర్ఘ సమీక్ష. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ మేరకు తాము సేకరించిన సూచనలు, సలహాలను నివేదిక రూపంలో అందించారు సీఎంకు. ఈ కార్యక్రమంలో హైలెట్ గా నిలిచారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సీఎంతో పాటు తను కూడా సమీక్షలు చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఇందులో జిల్లాల పునర్విభజనపై వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఉప సంఘం కన్వీనర్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ , మంత్రులు నాదెండ్ల మనోహర్, పి. నారాయణ గారు, నిమ్మల రామానాయుడు, శ్రీమతి వంగలపూడి అనిత పాల్గొన్నారు.
కాగా తుపాను కారణంగా వర్చువల్ విధానంలో మంత్రులు బి.సి. జనార్దనరెడ్డి, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. దీని గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి హయాంలో జిల్లాల పునర్ విభజన జరిగిందని, పూర్తిగా అశాస్త్రీయంగా చేశారంటూ మండిపడ్డారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని, తుపాను తీవ్రత తగ్గాక తిరిగి మరోసారి కీలక భేటీ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.






