మొంథా తుపాను ప్రభావంపై జర జాగ్రత్త
అమరావతి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను కాపాడు కోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. మంగళవారం ఆమె తన కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ప్రస్తుతం ముంథా తుపాను కొనసాగుతోందని, దీని కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కీలక సూచనలు చేశారు మంత్రి. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులతో వైద్య సేవలందించాలని ఆదేశించారు ఎస్. సవిత.
హాస్టళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయాలని స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను శుభ్రం చేయాలన్నారు. దోమలు చొరబకుండా హాస్టళ్ల గదుల కిటికీల వద్ద మెస్ లు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్ దృష్ట్యా హాస్టళ్లను, ఎంజేపీ స్కూళ్లను నిరంతరం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులు, విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టళ్ల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.






