సవాల్ విసిరిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. తనపై పదే పదే బీఆర్ఎస్ నేతలు రౌడీ షీటర్ అంటూ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దమ్ముంటే తాను రౌడీ షీటర్ నని నిరూపించాలని లేక పోతే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్ పై. ఖలేజా ఉంటే నిరూపించగలవా అని మండిపడ్డారు. తన మీద ఒక్క రౌడీ షీట్ కేసు అయినా నమోదు అయినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ విసిరారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
తనను రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. నిరూపిస్తే రాజకీయాలు వదిలేయడమే కాదు, హైదరాబాదే వదిలి వెళతానంటూ సంచలన ప్రకటన చేశారు నవీన్ యాదవ్. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన పార్టీల మధ్య పోటీ కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఉంది. ఇరు పార్టీలు ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఇందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు క్లాస్ తో పాటు మాస్ కూడా ఇక్కడ అత్యధికంగా ఓటర్లను కలిగి ఉన్నారు. దీంతో వీరి ఓట్లు అభ్యర్థుల గెలుపును నిర్దేశించనున్నాయి.






