ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెంచిన రేట్ల ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే జీవోలు జారీ చేసే ప్రసక్తి లేదన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యూసుఫ్ గూడలో సీఎంను సన్మానించారు సినీ కార్మికులు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ను హాలీవుడ్‌తో సమానంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాలతో పాటు ధీటుగా సినీ పరిశ్రమను బలోపేతం చేస్తామన్నారు. చిన్న, మధ్య తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు సహా, తెలంగాణను షూటింగ్ గమ్య స్థానంగా మారుస్తామని చెప్పారు.
ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడానికి కార్పొరేట్-స్టాండర్డ్ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు. ఇందులో ఉచిత అల్పాహారం, భోజనం కూడా ఉంటుందన్నారు. ప్రతిపాదిత పాఠశాల కోసం కృష్ణనగర్‌లో తగిన భూమిని గుర్తించాలని రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంఘాన్ని ఆదేశించారు. సినీ కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, రాబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని కేటాయిస్తామన్నారు.








