మాజీ సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ సీరియస్
అమరావతి : ప్రస్తుతం విపత్తులు నెలకొన్న తరుణంలో దురుద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు నారా లోకేష్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గతంలో సీఎంగా ఉన్న తను ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం భావ్యం కాదన్నారు. ఇవాళ మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీని వర్షాలు ముంచెత్తాయని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులంతా అలర్ట్ గా ఉన్నారని చెప్పారు. తాను కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారని , కానీ జగన్ మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తిచేస్తూ.. విష రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బెంగళూరు ప్యాలెస్ లో సేదతీరుతూ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్ . కాకినాడ జిల్లా కొత్తపల్లి పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా వెంటనే ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఇదిలా ఉండగా సహాయక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు.






