రూ.225 కోట్లు కావాలని అంచనాలు సిద్దం చేశాం
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుపాను ప్రభావంపై స్పందించారు. ఇవాళ సమీక్ష చేపట్టారు. మరో వైపు సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఆర్ అండ్ బి రోడ్లలో 334 లొకేషన్లలో 230 కిలోమీటర్ల మేర నష్టం జరిగిందని అధికారులు గుర్తించారని తెలిపారు. ముందస్తుగానే ఈఎన్సీలు, సి.ఈలు, ఫీల్డ్ ఇంజినీర్లను అప్రమత్తం చేయడం వలన ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామని పేర్కొన్నారు.
దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జీల తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ. 7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్ల అంచనాలు సిద్ధం చేశామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అకాల వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన చెందారు. తడిసిన ధాన్యాన్ని సేకరించి వెంటనే మిల్లులకు తరలించేలా సంబంధిత అధికారులకు సూచన చేయడం జరిగింది. పత్తి తేమ శాతం విషయంలో రైతులకు సడలింపులు ఇవ్వాలని సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తాని ముంబైలో కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు మంత్రి. తనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. ఆరు నూరైనా సరే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు .






