స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి : మొంథా తుపాను కారణంగా దెబ్బ తిన్న రహదారుల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. శుక్రవారం తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కానూరు–ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మించే చర్యలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు ఆమోదం పొంది, నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు మొదలు కానున్నాయని ప్రకటించారు. ఇకపై ఈ రహదారి తుఫాన్లకూ, వర్షాలకూ తట్టుకునే స్థాయిలో శాశ్వతంగా నిర్మించడం జరుగుతుందన్నారు కందుల దుర్గేష్. అదేవిధంగా రూ.3.24 కోట్లతో వడ్లూరు–తీపర్రు రహదారి, రూ.4.20 కోట్లతో కానూరు–లంకలకోడేరు రహదారి, రూ.8.30 కోట్లతో ఖండవల్లి–ముక్కామల, దువ్వు–తీతలి–మునిపల్లి రహదారుల నిర్మాణ పనులు కూడా ఆమోదం పొందాయని తెలిపారు. నిర్మాణం దిశగా సాగుతున్నాయని చెప్పారు.
పరిపాలనలో పారదర్శకత, ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పుంత రహదారులు, డ్రైన్లు, గ్రామీణ అంతర్గత రహదారులన్నీ కొత్త శోభన సంతరించు కునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. అంతకు ముందు నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్వోబీ పనులు పరిశీలించారు. రూ.3 కోట్లతో కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. పెండ్యాల గ్రామంలో 44 మొంథా తుఫాన్ బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుఫాన్ కట్టడిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అధికార యంత్రాంగం అద్భుత పనితీరు కనబర్చిందని ప్రశంసలు కురిపించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, సహచర మంత్రులు, అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో మొంథా తుఫాన్ నష్టాన్ని నివారించామన్నారు.






