బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని , తెలంగాణను మొంథా తుపాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులంతా రంగంలోకి దిగారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. అయితే మొంథా తుఫాన్‌తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పెళ్లిళ్లు, పేరంటాలు, సినీ తారలతో తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయి రైతులు కష్టాల్లో ఉన్నా, వారిని పరామర్శించే సమయం కూడా రేవంత్‌కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఫ్లోర్ లీడర్. పక్కన ఉన్న సీఎం , తన గురువు నారా చంద్రబాబు నాయుడును చూసి నేర్చు కోవాలని హితవు పలికారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
విపత్తు సమయంలో ప్రజలతో పాటు నిలబడే నేతగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే, రేవంత్ మాత్రం ప్రదర్శన రాజకీయాల్లో మునిగి పోయారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల సీఎం నిర్లక్ష్య ధోరణి అంగీకార యోగ్యం కాదని ఏలేటి మండిపడ్డారు.






