ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రజలకు ఇబ్బందులు మొదలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, ఐటీ, తదితర రంగాలను బలోపేతం చేయడం జరిగిందని చెప్పారు కేటీఆర్.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా మేలు చేశామన్నారు. లెక్కలేనన్ని పరిశ్రమలు వచ్చాయని. ప్రధానంగా అభివృద్ధి ఎక్కువగా జరిగిందని చెప్పారు.
2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు.జూబ్లీహిల్స్‌లో కూడా మాగంటి గోపినాథ్‌ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని అన్నారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్య సమస్యలతో గోపినాథ్ కన్నుమూశారంటూ వాపోయారు. మీరంతా మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని ఆరోపించారు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో మీరంతా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూశారు రెండేళ్ల కాంగ్రెస్ పాలన చూస్తున్నారని అన్నారు.






