సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన ప్రకటించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం తన భాషను మార్చు కోవాలని సూచించారు. సభ్య సమాజం తను మాట్లాడే మాటలను జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అమీర్‌పేట్‌కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాధ్ వీరాభిమాని అని అన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారు తప్పా ఆయనపై ప్రేమతో కాదన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
జూబ్లీహిల్స్ ఒక్కటే హైదరాబాద్ నగరంలో ఉందా? మిగతా నియోజకవర్గాలు లేవా అని ప్రశ్నించారు సీఎంను. సన్నబియ్యం, రేషన్ కార్డులు తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అంటే, నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చారంటూ మండిపడ్డారు. దేశానికి రెండవ రాజధాని నగరం స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. భయంతోనే అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన సీఎం స్థానంలో ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.






