ప్రకటించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చిన రోజున అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాము వచ్చేంత వరకు, హైడ్రా ఏర్పాటు కానంత వరకు నగర వాసుల్లో దీని పట్ల అవగాహన ఉండేది కాదన్నారు. కానీ తాను వచ్చాక పూర్తిగా మార్చేశామన్నారు. ఇవాళ చిన్నారులు, విద్యార్థుల్లో చెరువులు, కుంటలు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఇలా ప్రతి ఒక్క దానిపై అవగాహన ఏర్పడిందన్నారు. ఇప్పుడు చెరువుల చెంత, నాలాల పక్కన ఇంటి స్థలం కొనేవారు పైన పేర్కొన్న లెక్కలన్నీ సరి చూసుకుని కొంటున్నారని హైడ్రా కమిషనర్ తెలిపారు. నగర భవిష్యత్తుకు హైడ్రా చేస్తున్న కృషికి ప్రజలందరి సహకారం లభిస్తుందంటే కారణం వాటి ఆవశ్యకతను తెలుసు కోవడంతోనే సాధ్యమైందని చెప్పారు ఏవీ రంగనాథ్.
ఏడాదిలో దాదాపు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమని హైడ్రా కాపాడిందని చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) తెలిపిన వివరాల ప్రకారం నగరంలో 61 శాతం చెరువులు కనుమరుగు అయ్యాయని ఆవేదన చెందారు. ఇదే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో మొత్తం చెరువులు మాయం అవుతాయని హెచ్చరించారు. అందుకే చెరువులతో పాటు నాలాల పరిరక్షణకు హైడ్రా నడుం బిగించిందన్నారు. మొదటి విడతగా 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాక పోతే వరదలను నియంత్రించగలమని చెప్పారు. ఇలా హైడ్రా చేస్తున్న ప్రతీ చర్యా.. పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. విజిలెన్స్ వారోత్సవాలను పాఠశాలల్లో నిర్వహించామని బీహెచ్ ఈ ఎల్ హైదరాబాద్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ రాజా తెలిపారు. విద్యార్థి దశలోనే అవగాహన తీసుకువస్తే మంచి పౌరులుగా మారుతారన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన ఉద్యోగులతో పాటు, విద్యార్థులకు బహుమతులు అందజేశారు కమిషనర్.






