ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టండి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ది చేయడం జరిగిందన్నారు కేటీఆర్. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద కుటుబాలకు అండగా నిలిచామని చెప్పారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇచ్చాం, నీటి పారుదల ప్రాజెక్టులకు జీవం పోశామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని అన్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో ఏడేళ్లు పట్టే ఫ్లై ఓవర్లను మేం అతి తక్కువ కాలంలోనే చేశామని తెలిపారు. ఎన్నో పనులు నాలుగేళ్లలో పూర్తి చేశామన్నారు.
ఈ రెండేళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందో ఒక్కసారి బేరీజు వేసుకోవాలని సూచచించారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజలు ఆగమాగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అని అడిగితే టీ హబ్ అని చూపిస్తుందన్నారు. దీనిని ఏర్పాటు చేసింది మేమేనని మీకు తెలియంది కాదన్నారు. మేం దేశంలోనే కాదు ప్రపంచం తోనే పోటీపడ్డాం అని అన్నారు. మా హయాంలో తలసరి ఆదాయం రూ. 3.87 లక్షలుగా మార్చేశామన్నారు కేటీఆర్. తాము వచ్చాక 6 లక్షల ఉద్యోగులను ఐటీ రంగంలో కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ ఎన్నిక కారుకు బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.






