ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో
హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వయంగా జనాన్ని కలిసి సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే జాగృతి జనం బాట. ఇందులో భాగంగా రైతులు, కళాకారులు, వృత్తి నైపుణ్యం కలిగిన వారిని స్వయంగా కలుస్తూ వారి బాధలు వింటున్నారు. ఇదిలా ఉండగా ప్రధానంగా బీసీల కోసం తన గొంతు విప్పారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలకు మద్దతు ప్రకటించారు. తానే స్వయంగా ఖైరతాబాద్ లో నిర్వహించిన మానవ హారంలో పాల్గొన్నారు. బీసీలకు బేషరతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 42 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కవిత.
ఇదిలా ఉండగా బీసీల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవితకు మద్దుతుగా తెలంగాణ జాగృతి లో చేరారు తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత , మేడే బాపురాజు,వీ రమల్ల శారద, శివ పటేల్. వీరితో పాటు పలువురు జాగృతి సంస్థ కండువా కప్పుకున్నారు. చెంగిచర్ల ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కవిత వెంట ఉంటామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్, మియాపూర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు యువకులు, తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్, మూసారాంబాగ్, మేడ్చల్ కు చెందిన విద్యార్థులు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.






