సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించే రైతులను ఆదుకోక పోవడం దారుణమన్నారు. ప్రధానంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్ట పోయారని వాపోయారు. ప్రధానంగా పత్తి పంట దెబ్బతిందని పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా కవిత ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకు వచ్చిన పత్తిని పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
పత్తి రైతుల దుస్థితి దారుణంగా ఉందన్నారు కల్వకుంట్ల కవిత. అకాల వర్షాలు అధిక తేమ స్థాయిలకు కారణమయ్యాయని వాపోయారు. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తోందన్నారు. దీనివల్ల రైతులు ట్రాక్టర్ లోడ్‌కు దాదాపు ₹50,000 నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20–25% తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే కేంద్రానికి లేఖ రాసి మన రైతులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు కవిత. పత్తి తేమగా, అచ్చుగా లేదా మొలకెత్తినందునే నెపంతో పక్కన పెడితే ఎలా అని ప్రశ్నించారు.






