నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి
హైదరాబాద్ : మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కేవలం ఓట్ల కోసం తప్ప మరోటి కాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. ఆయన దేశం గర్వించ దగిన క్రికెటర్ అని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఆయన అర్హుడని, కానీ కేవలం మైనార్టీ శాఖను కేటాయించారని , ఇదంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీలను సంతృప్తి పర్చేందుకు, ఓట్లను తమ వైపు మళ్లించేందుకు సీఎం , కాంగ్రెస్ కలిసి ఆడిన నాటకం అన్నారు. కేవలం ఆరు నెలలు మాత్రమే అజ్జూ మంత్రిగా ఉంటాడని, ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలే చేస్తుంది తప్ప అభివృద్ధి కాదనీ ఈ చర్యతో అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
జూబ్లిహిల్స్ ‘ చెయ్యి’ జారిపోతుందని తేలి పోయిందని, దీంతో ఉన్నపళంగా వాళ్లకు అజహరుద్దీన్ గుర్తుకు వచ్చాడని ఎద్దేవా చేశారు రాకేశ్ రెడ్డి. ఓ వైపు ఎన్నికల కోడ్ ఉండగా ఎలా మినిస్టర్ పోస్టు ఇస్తారని అందరూ ప్రశ్నిస్తుంటే నోరు మెదపడం లేదన్నారు. కేవలం మతాన్ని, ఓ వర్గాన్ని మెస్మరైజ్ చేసేందుకే తనను మంత్రివర్గంలో చేర్చుకున్నారని, ఆ విషయం అజహరుద్దీన్ కు కూడా అర్థమై పోయిందన్నారు .
కాంగ్రెస్ నిజంగా అభివృద్ధి కోసమో, అజారుద్దీన్ అనుభవం, సేవలు ప్రభుత్వానికి అవసరం అనుకుంటే ఆయన మైనారిటీ సంక్షేమం కంటే రాష్ట్రం లో క్రీడల ఉన్నతికి, యువజన సర్వీస్ లకు సరైన వ్యక్తి అనేది ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు రాకేశ్ రెడ్డి.






