9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో గూడం గ్రామంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది గూడెం. గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు వెలుగుకు నోచుకోలేదు. గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లి విరిసేలా చేశారు. ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు… గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.
మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఈ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. అయిదు నెలల కిందట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. దీంతో సమస్యను పరిష్కరంచేలా చేశారు.






