ధైర్యం ఉంటే చర్చకు రావాలి
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండడంపై మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనంటూ అన్ని సర్వే సంస్థలు ఇప్పటికే ప్రకటించాయని, దీనిని జీర్ణించు కోలేక ఫ్రస్టేషన్ కు గురై ఏవేవో మాట్లాడుతున్నాడని, ఇది మంచి పద్దతి కాదన్నారు. తమకు కూడా నోరు ఉందని, తాము కూడా మాట్లాడగలమని, కానీ తమకు సంస్కారం ఉందన్నారు. దమ్ముంటే సీఎం పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పైన చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామన్నారు. మా హయాంలో స్టార్ట్ అయినవే కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. కొత్తగా ఏ ఒక్కటన్నా నిర్మించారా అని నిలదీశారు.
కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్డు అయినా నిర్మించావా అని ఫైర్ అయ్యారు. కొత్త రోడ్ల సంగతి తర్వాత.. కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అని ప్రశ్నించారు కేటీఆర్. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని కానీ కట్టింగ్ మినిస్టర్ కాదన్నారు. అందుకే రేవంత్ రెడ్డి కొంత హుందాగా ఉండాలని హితవు పలికారు. మళ్లీ వాటర్ ట్యాంకర్‌లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో శానిటేషన్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. కేసీఆర్ కూడా సీఎంగా ఒక ఏరియాను ఎంచుకొని అక్కడ శానిటేషన్ పనులు పర్యవేక్షించారని, కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి వెళ్లడం తప్పితే చేసింది ఏముందని ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతి రోజు 7.5 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించారని తెలిపారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో మేం 30 అవార్డులు సాధించామన్నారు. బెస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చిందన్నారు.






