సంచలన ఆరోపణలు చేసిన ఏపీపీసీసీ చీఫ్
విజయవాడ : ఓట్ల చోరీ చేయడం వల్లనే హర్యానాలో ఇటీవల జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. లేక పోయి ఉంటే తమ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేదన్నారు. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య ఓట్ షేర్ పెద్ద తేడా లేదన్నారు. కేవలం 1.18లక్షల ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలో వచ్చిందన్నారు. 0.7 ఓట్ల తేడా మాత్రమే బీజేపీకి మెజారిటీ దక్కిందన్నారు. హర్యానాలో జరిగింది ముమ్మాటికీ సర్కార్ చోరీనంటూ మండిపడ్డారు. 25 లక్షల దొంగ ఓట్లను చేర్చి అధికారం దక్కించుకున్న విషయాన్ని ఆధారాలతో సహా తమ నాయకుడు రాహుల్ గాంధీ బయట పెట్టారని చెప్పారు షర్మిలా రెడ్డి. అయినా నిస్సిగ్గుగా దీనిని కేంద్ర ఎన్నికల సంఘం వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు.
దొంగ ఓట్లు లేకుంటే హర్యానాలో కాంగ్రెస్ భారీ మెజారిటీ వచ్చేదన్నారు షర్మిలా రెడ్డి. హర్యానాలో జరిగింది అన్యాయమేనని వాపోయారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంతా కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుందని ప్రకటించాయని , కానీ తీరా చూస్తే బీజేపీ మోసం కారణంగా అక్రమంగా పవర్ లోకి వచ్చిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది గమనించి దొంగ ఓట్లను ECI సారధ్యంలో చేర్చారంటూ మండిపడ్డారు. నిజానికి ఈ దేశంలో ఒక్క ఓటు దగ్గరే సమానత్వం ఉందని, పేద వాడైనా, ధనవంతుడైనా ఓటు వద్దే సమానమన్నారు. ఈ అవకాశాన్ని కూడా చివరకు కేంద్ర ఎన్నికల సంఘం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి.






