మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్ కాదు నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర దశ, దిశా మారబోతోందన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారని, మిగతా వారంతా అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. కేసీఆర్ పాలనలో వికాసం జరిగితే రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు హరీశ్ రావు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయంలో రూ. 5,300 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని బ్లాక్ మెయిలర్ అని సంచలన ఆరోపణలు చేశారు హరీశ్ రావు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని, రెండేళ్ల నుంచి కాలేజ్ యాజమాన్యాలు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారని అయినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాలేజ్ యాజమాన్యాలను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో 19 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం జరిగిందన్నారు. ఆరోగ్య శ్రీ డబ్బులు చెల్లించలేక పోవడం వల్ల ఆరోగ్య శ్రీ బంద్ పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. హైడ్రా పేరుతో భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టడం , రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు.






