తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్కార్ తో ఆటలాడు కోవాలని చూస్తే ఊరుకుంటామని అనుకుంటే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు. ఎవరి ప్రోత్బలంతో మీరంతా ఆందోళనలకు దిగారో తమకు తెలుసన్నారు. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే బాగుండదన్నారు. తమాషాలు చేస్తే తాట తీస్తానని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అని నిలదీశారు. తమ ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందని, ఆ మాత్రం దానికి ఊరుకోమంటే ఎలా అని ఫైర్ అయ్యారు సీఎం.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించ బోమంటూ స్పష్టం చేశారు. మీరు ఆడినట్లు ఆడాలంటే ఇక్కడ కుదరదన్నారు. మీరు చెప్పినట్లు సర్కార్ నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాగే చేస్తూ పోతే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు మూసి వేస్తామంటే ఆయా కాలేజీల యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదన్నారు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంట కాగుతున్నారో మాకు తెలుసు అన్నారు. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాలని సీరియస్ కామెంట్స్ చేశారు. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామన్నారు.






