సర్కార్ ను ఆదుకోవాలని డిమాండ్
వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. తుపాను కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, ఎంతో నిరాశ్రయులుగా మారారని ఇప్పటి వరకు సర్కార్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. అసలు సీఎంకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై ఉన్నంత శ్రద్ద బాధితులకు న్యాయం చేయాలని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. శనివారం తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. అంతకు ముందు ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు ఎంజీఎం ఆస్పత్రిని. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
హనుమకొండలోని సమ్మయ్య నగర్లో వరద బాధిత కుటుంబాల పరిస్థితిని చూసి చలించి పోయారు కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి పర్యటించి వాగ్దానాలు చేసి 15 రోజులు అయిందని, గతంలో తానే కీలక ప్రకటన చేశారని, తన మాట G.O.తో సమానమని ఆయన అన్నారని అది మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు కవిత. అయినప్పటికీ ఒక్క కుటుంబానికి కూడా సహాయం అందలేదన్నారు. ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత సర్కార్ పై ఉందన్నారు. ఆరు నూరైనా బాధిత కుటుంబాల తరపున తెలంగాణ జాగృతి సంస్థ పోరాడుతుందన్నారు.






