కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని సీఎం రేవంత్ రెడ్డి ముందే ఒప్పుకున్నారని, అందుకే ఈ ఎన్నిక రెఫరెండం కాదంటూ ప్రకటించాడని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి వెంగళరావు నగర్ లో రోడ్ షో చేపట్టారు. ఈసందర్భంగా ఆయన సీఎంను లక్ష్యంగా చేసుకున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ ను బట్టి చూస్తే ఓటమి ఖాయమై పోయిందన్నారు. తమ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. కేవలం మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే తాము ఆలోచిస్తున్నామని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తమ నాయకుడు కేసీఆర్ ను అనరాని మాటలు అంటున్నాడని ఫైర్ అయ్యారు కేటీఆర్.
సీఎం చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. తను కొలువు తీరాక ఏం చేశారో, ఎలాంటి అభివృద్ది పనులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. గతంలో చెప్పినవే మరోసారి ఏకరువు పెడుతూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. చెప్పిన కథలనే తిరిగి చెబితే ఎవరూ ఒప్పుకోరన్నారు. జనం చాలా తెలివి పరులని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఇంకా మరిచి పోలేరన్నారు కేటీఆర్. రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలన్నారు. హైదరాబాదు నగరాన్ని అధః పాతాళానికి తీసుకు వెళ్లినందుకు నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.






