శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్
చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లోని ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో పాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును వివరించారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగులు ప్రత్యేకంగా చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్యూట్ చేశాయి. అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువచ్చేది ఏనుగుల చేత ప్రదర్శింప జేశారు. మానవ, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మదపు టేనుగుల గుంపు, నివాసాలు, పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును ప్రారంభించారు.






