స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదల ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యేకించి ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ ను సందర్శించారు. అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్ర సర్కార్ తో మాట్లాడి అక్కడి నుంచి కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకు వచ్చారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా తాను తీసుకు వచ్చిన కుంకీ ఏనుగులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గాను ఇవాళ ఏనుగుల క్యాంప్ వద్దకు వెళ్లారు. అక్కడ తనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ఆయన కొద్ది సేపు కుంకీ ఏనుగులను పరిశీలించారు. వాటిని ఎలా సంరక్షిస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇదే సమయంలో వీటి నిర్వహణ, సంరక్షణలో ఎలాంటి అలసత్వం ఉండ కూడదని హెచ్చరించారు. ప్రత్యేకించి రికార్డులను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్. మరో వైపు కలప స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మొత్తం వైసీపీ హయాంలోనే ఎక్కువగా స్మగ్లింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. వారి భరతం పడతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కొణిదల.






