మాజీ మంత్రి అంబటి రాంబాబు
తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం వద్దకు వెళ్లారు. అక్కడ మహా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన అద్వితీయమైన ఆనందానికి లోనయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.
దయచేసి తిరుమలకు వెళ్లే భక్త బాంధవులంతా తప్పకుండా శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఇలాంటి ప్రసాదం ప్రపంచంలో ఎక్కడా దొరకదన్నారు. ఆ స్వామి వారి కరుణ వల్లనే ఇదంతా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గతంలో తమ సర్కార్ హయాంలో కూడా ఈ ప్రసాదాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం శ్రీవారి అన్న ప్రసాదం మాత్రం రుచికరంగా, మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఆ దేవ దేవుడు రాష్ట్ర ప్రజలకు మంచిని చేకూర్చేలా చూడాలని తాను కోరుకున్నట్లు తెలిపారు అంబటి రాంబాబు.







