ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్
బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. బీహార్‌లో కూటమిని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్ . తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం కంటే ప్రజలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి ఇష్టపడతానని స్పష్టం చేశారు . బిజెపి నేతృత్వంలోని కేంద్రం గుజరాత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీని సాధించ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో చేరే అవకాశాన్ని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు.
రాజకీయ వ్యూహకర్తగా మారిన రాజకీయ నాయకుడు తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం అనేది ఉండదన్నారు. తాను , తన పార్టీ పూర్తిగా ప్రజల కోసం ఏర్పాటైందన్నారు. బీహార్ ప్రజలు ఇంకా మారకూడదనుకుంటే, మేము వారితోనే ఉండి మరో ఐదు సంవత్సరాలు పని చేస్తూనే ఉంటామన్నారు ప్రశాంత్ కిషోర్. ప్రభుత్వంలో చేరే ప్రశ్న కూడా లేదన్నారు. జన్ సురాజ్ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. లేక పోతే ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పారు. తాము బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమని మరోసారి కుండ బద్దలు కొట్టారు. తమకు ఎక్కువ సీట్లు రాక పోవచ్చని అన్నారు. అయినా తాము బాధ పడమన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పని చేస్తామన్నారు.






