వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయింది
తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలోని మంగళం లోని అటవీ శాఖకు చెందిన గో డౌన్లను పరిశీలించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించాలని ఆదేశించారు. అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఎర్ర చందనం స్మగ్లర్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. వారి తాట తీస్తామన్నారు. అంతే కాకుండా కింగ్ పిన్ లు ఎవరు ఉన్నారనేది కూడా తమకు తెలిసిందని, త్వరలోనే వారి వివరాలు వెల్లడిస్తామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే ఈ ఎర్ర చందనం దొరుకుతుందన్నారు.
ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేసే వారంతా దీన్ని ఆపకపోతే సంవత్సరంలోగా ప్రత్యేకమైన ఆపరేషన్ ద్వారా ఎర్ర చందనం అక్రమ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరినీ ఏరివేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, ముందున్న అవకాశాలు, అవరోధాలు చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ఐదు జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో తిరుపతి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్ధాంత పరమైన భావజాలం ఉన్న వామపక్ష వాద తీవ్రవాదాన్ని దేశ శ్రేయస్సు దృష్ట్యా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. మేం కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని చెప్పారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. వారు స్వచ్ఛందంగా ఈ అక్రమ రవాణాను మానుకుంటే మంచిది. అలా కాకుంటే మేం కూడా కగార్ తరహా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వచ్చే ఏడాది కాలం లోపు ఎర్రచందనం స్మగ్లర్లు లేకుండా చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ఎంతగా దృష్టి పెడుతుందో, ప్రకృతి సంపదను రక్షించడంలో కూడా అంతే ప్రాధాన్యాన్ని తీసుకుంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.






