సక్సెస్ చేయాలని ఆదేశించిన చంద్రబాబు
విశాఖపట్నం : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ సీఐఐ సమ్మిట్ 2025 కు విశాఖపట్నం నగరం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది రాష్ట్ర కూటమి సర్కార్. ఇందులో భాగంగా సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు నిర్వాహకులకు సూచనలు చేస్తూ మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లండన్, అమెరికా, సింగపూర్, దుబాయ్ దేశాలలో పర్యటించారు. ఔత్సాహికులు, కంపెనీల ప్రతినిధులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు, కన్సల్టెంట్స్, పారిశ్రామికవేత్తలను కలిశారు.
ఈ సందర్బంగా ఏపీలోని విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బోయే ఈ సీఐఐ 2025 సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఈ సమ్మిట్ ను ప్రత్యేకంగా ఏపీ సర్కార్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన మొత్తం మంత్రులంతా ఇక్కడే కొలువు తీరారు. దీనిని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని కృత నిశ్చయంతో పని చేస్తున్నారు. ఇదే సమయంలో సర్కార్ ఏకంగా 10 లక్షల పెట్టుబడులు రాబట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఎంఓయూ (పరస్పర అవగాహన ఒప్పందం) చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది.






